Importance of Shattilaa Ekadasi - షట్ తిలా ఏకాదశి


షట్ తిలా ఏకాదశి

భవిష్యోత్తర పురాణంలోని శ్రీ పులస్త్య దాల్భ్య సంవాదము. ఋషీశ్వరుడైన దాల్బ్యుడు పులస్త్యుని ఇట్లు అడిగెను. ఓ మునివరా! మాఘ మాసంలో బహుళ ఏకాదశికి ఏమని పేరు? దీనిని ఎందుకు పాటించవలెను? వ్రతం ఆచరించిన వారికి ఈ ఏకాదశి ఇటువంటి శుభ ఫలితములు ఒసంగును? వివరింపుమని పలికి మరలా అజ్ఞానంతో ఎవరు గోహత్య, బ్రహ్మహత్య, దుష్కర్మలు, పాపకర్మలు చేసెదరో వారు నరకమున ఉండవలెనని శాస్త్రంలో చెప్పబడింది. కనుక వారు ఏ శుభ సత్కర్మమును ఆచరించి యమలోకము నుండి విముక్తులు కాగలరు. నా ఈ సందేహమును బాగుగా తీర్చివలసినది అని ప్రార్ధించెను. అప్పుడు పులస్త్యుడు ఇట్లు చెప్పసాగెను. ఓ మహానుభావా! మాఘ మాసంలో బహుళ ఏకాదశి నాడు ప్రాతః స్నానం చేసి శ్రద్ధతో భగవంతుని పూజార్చనము చేసి భగవంతుని ప్రీతి కొరకై ఓ జగత్పాలక! నీవు ప్రతి ఒక్కరి పాపములను అపహరించుదువు. సంసార సాగరమున మునిగి తేలుచున్న వారిని నీవే రక్షించగలవు. నా చేత పుష్ప, అర్ఘ్యము నీవు మరియు లక్ష్మీదేవి గ్రహింపుము. ఇట్లు ప్రార్థించి, పూజార్చన చేయవలెను. పిమ్మట భగవత్ భక్తులకును, బ్రాహ్మణులకును, వస్త్రములు, పాదుకలు, గొడుగులు, జల పాత్రములు, గోదానములు మరియు తిలాదానము చేయవలెను. నువ్వులు ఎన్ని దానం చేయుదురో అన్ని సంవత్సరములు ఊర్ధ్వలోకమున ఉండుటకు భాగ్యము లభించును.
తిలా హోమము, తిలలను శిరస్సుపై ధారణము, తిలా స్నానం, తిలతర్పణం, తిలాదానము మరియు తిలా బిభోజనం అను ఈ ఆరు సత్కర్మలు చేసిన వారికి సర్వపాపములు నాశనమగును. అందువలన ఈ ఏకాదశి వ్రతమును షట్ తిలా ఏకాదశి అని అందురు.

ప్రాచీన కాలమున ఒక బ్రాహ్మణి మిక్కిలి నిష్టాపరురాలై భగవత్పూజ చేసేది. ఆహార సంయమముతో ఏకాదశి వ్రతములు చేయుచు ఆమె శరీరం శుష్కించి పోయెను. ఎంతోమంది జనులకు ఆ బ్రాహ్మణి ధన సహాయమును, గృహములు కట్టుకొనుటకు తగిన ఏర్పాట్లు చేయుచున్నదే కానీ, బ్రాహ్మణ - వైష్ణవ - - భక్త బృందములకు ఒక్కపూట అన్నదానం కూడా చేయలేదు. పశుపక్ష్యాదులకు కూడా ఒక్క ముద్ద అన్నం పెట్టెడిది కాదు. అట్లు ఉండగా ఒకనాడు భగవానుడు కాపాలికుని వేషమున బ్రాహ్మణిని పరీక్షించదలచి ఆమె గృహమునకు వచ్చి భిక్ష అడిగెను. అప్పుడు బ్రాహ్మణి మీరెవరు? ఎచ్చట నుండి వచ్చినారు? అని ప్రశ్నించెను. భగవానుడు నాకు భిక్ష కావలెను. కొంచెము భిక్ష పెట్టు తల్లీ! అని అడిగెను. ఆ మాటలు విని బ్రాహ్మణి మిక్కిలి కోపంతో ఒక మట్టిముద్దను తెచ్చి భిక్షా జోలెలో వేసినది. మారువేషమున ఉన్న భగవానుడు ఆ మట్టి ముద్దుకే సంతుష్టుడై దానిని తీసుకుని అదృశ్యమయ్యెను. బ్రాహ్మణి ఎంతో వ్రత, పూజ, దానధర్మములు చేసి వైకుంఠ ధామమునకు వెళ్లినది. కానీ ఉండుటకు సౌకర్యం లభించినను తినుటకు మాత్రం ఏమియు దొరుకుట లేదు. ఆమె ఆకలి బాధతో వైకుంఠాధిపతికి ఇట్లు చెప్పసాగెను. ఓ దేవా! నేను ఎంతో దానధర్మములు పూజాదులు చేసి పుణ్యఫలమున వైకుంఠమునకు వచ్చితిని

గదా! అట్టి నాకు ఆహారం ఏల లభించుట లేదు? అప్పుడు భగవంతుడు ఆ బ్రాహ్మణితో ఇట్లు చెప్పెను. ఓ తల్లీ! నీవు ఎంతో గొప్ప భక్తురాలవు. నీకు నా ఎడల గల భక్తి శ్రద్ధలు అమిత సంతోషంలో కలిగించినవి. నీవు మరల మర్త్య లోకమునకు వెడలి నీ గృహమునందే యుండుము, కొలది దినములలో దివి నుండి కొందరు దేవేరులు భూలోకమునకు వచ్చెదరు. అప్పుడు నీవు వారి వద్ద షట్ తిల ఏకాదశి మహాత్మ్యమును గురించి అడిగిన యెడల నీకు సర్వశుభములు కలుగుననెను. ఆనాటి నుండి భగవానుని ఆదేశమును శిరసావహించి ఆ బ్రాహ్మణి తన గృహమునకు చేరి, భోజనము లేకయే కొన్ని దినములు గడిపెను. తర్వాత స్వర్గము నుండి దేవేరులు ఆమె వద్దకు వచ్చి, మేము దేవేరులను తలుపుతీయమని పలికిరి. అప్పుడు బ్రాహ్మణి వెంటనే తలుపు తీయక గదియందే ఉండి మీరు షట్ తిల ఏకాదశి మహిమ గురించి చెప్పగలిగినచో నేను బయటకు రాగలరు. అని పలుకగా, వారి యందొక దేవి ఆ ఏకాదశి మహిమను చక్కగా వర్ణించినది. ఆ విధంగా బ్రాహ్మణి ఏకాదశి ఈ వ్రతాచరణము నియమ నిష్టలతో ఆచరించి భగవత్ప్రసాదమును భక్త, బ్రాహ్మణులు మరియు దీన దరిద్రులకు సమర్పించి పునః వైకుంఠవాసుని సన్నిధానమునకు వెళ్లి ఎంతో సుఖంగా ఉండెను.

Post Navi

Post a Comment

0 Comments