ఈ రోజు సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల కలిగే లాభాలు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

ఇది పవిత్రమైన దినం. ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.


ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి - అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం.

"సూర్యగ్రహణ తుల్యాతు శక్లామాఘస్ సప్తమీ"

ఆకారణం చేత ఈ రోజున సరియైన గురువునుండి, మంత్రదీక్షలు తీసుకొన్నా, కొత్త నోముు పట్టినా విశేషఫలం ఉంటుంది. తమకు ఉపదేశింపబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయమిది.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!

సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, శోకాలు నశిస్తాయి.

౧. ఈ జన్మలో చేసిన, ౨. జన్మాంతరాలలో చేసిన, ౩. మనస్సుతో, ౪. మాటతో, ౫. శరీరంతో, ౬. తెలిసీ, ౭. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.

చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.

ఆవు పేడ పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.

జననీ సర్వలోకాకే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే - అని సప్తమీ తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి. జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, తామ్రపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.
Post Navi

Post a Comment

0 Comments